Welcome Guest
Register

జంతువుల/పక్షుల స్వేచ్ఛను
హరిస్తే మన స్వేచ్ఛ కూడా పోతుంది.

ప్రియ మిత్రులారా ! చాల మంది జంతువులను ముఖ్యంగా పక్షులను పంజరాల్లో బంధించి ఉంచుతారు. ఇది చాల ప్రమాదకరం, ఎందుకంటే....

ఒక విశ్వ సూత్రం ఇలా చెబుతుంది, "మనం ఏ గుణాలనైతే కలిగి ఉంటామో సరిగ్గా same to same అవే పరిస్థితులను మనం అనుభవిస్తాం" అని.

స్వేచ్ఛగా విహరించే ఒక పక్షిని వల వేసి పట్టి, దాని రెక్కలు కత్తిరించి లేదా ఈకలు పీకి వాటిని పంజరాల్లో బంధించి ఉంచుతారు. ఆ పంజరం మహా అయితే అడుగో లేక రెండు అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. వాటిని బంధించడంలో ఎందుకు మనకు అంత ఆసక్తి ? వాటిని బంధించి ఆనందించడం అనేది "శాడిజం" ! ఎవరైతే పంజరాల్లో పక్షులను పెంచుతున్నారో వారిని కూడా ఒక చిన్న గదిలో బంధిస్తే ఎలా ఉంటుంది ? వాస్తవానికి ఇదే జరుగుతుంది.

పంజరాల్లో పక్షులను, ఇతర జంతువులను పట్టి బంధించి వాటి స్వేచ్ఛను హరించే వారు తమ నిజ జీవితంలో స్వేచ్చను కోల్పోతారు. తమ జీవితం పైన సార్ధకతను కోల్పోతారు. ఎందుకంటే " మీరు ఏం చేస్తారో మీకూ అదే జరుగుతుంది" అనేది విశ్వ సూత్రం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే "మీరేం చేస్తారో అంతకు వెయ్యి రెట్లు అనుభవిస్తారు" అనేది కరెక్ట్ !

పక్షులకు భూమి పైన ఒక ప్రత్యేకత ఉంది. పక్షిజాతి మాత్రమే ఎగరగలదు. వినీలాకాశంలో, చెట్లల్లో, కొండల్లో, కోనల్లో, అడవుల్లో, తోటల్లో అక్కడా ఇక్కడా అని లేకుండా, ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా విహారం చేసే అవకాశం పక్షికి మాత్రమే ఉంది.

అంతటి స్వేచ్చను అనుభవించే అధికారాన్ని, హక్కును, సామర్ధ్యాన్ని పుట్టుకతోనే సహజంగా తెచ్చుకున్న పక్షిని ఒక చిన్న పంజరంలో వేసి బంధించి వాటిని పెంచడం అనేది మా హాబి అని చెప్పడం ఎంత వరకు సమంజసం ???

మనం మనుషులం. మనకు జీవితం ఉన్నట్టే వాటికీ కూడా జీవితం ఉంది. ఏ "గుణం" ద్వారా, ఏ "అవగాహన" ద్వారా, ఏ "జ్ఞానం" ద్వారా, ఏ "నిర్ణయం", ద్వారానైతే మనం పక్షుల జీవితాలను లెక్క చేయటం లేదో, వాటి జీవితాలను అసలు జీవితాలే కాదు అన్నట్టు చూస్తామో, అదే "గుణం" మన పట్ల కూడా వర్తించి మన జీవితంలోని స్వేచ్చను కోల్పోతాం, సాధికారతను కోల్పోతాం.

చాల చిన్న, చిన్న గాజు కుండీలలో చేపలను పెంచుతూ ఉంటారు ఇది కూడా సబబు కాదు. మీ ఇంటి అలంకరణ కోసం మీరు ఇతర జీవాలను బంధించి వాడుకుంటే, మీరు కూడా మీ జీవితంలో బంధించబడి అలంకరణ వస్తువుగా మారుతారు చేపల్లాగే ! చేపలను బంధించి అలంకరించడం "శోభ" అని మీరు అనుకుంటారు, అయితే అది మీకు "క్షోభను" ఇస్తుంది. "అక్వేరియాలు శోభ కాదు క్షోభ" ! దయచేసి వాటి గురించి, వాటి జీవితం గురించి ఆలోచించండి. అవి ఎంతో బాధపడుతూ ఉంటాయి. ఎంతో క్షోభను అనుభవిస్తూ ఉంటాయి. ఎంతగానో దుఖిస్తూ ఉంటాయి. ఆ "కర్మ" అంతా మీకు చుట్టుకుంటుంది. అంతకు అంతా మీరూ అనుభవిస్తారు.

ఇంకా రకరకాల పెంపుడు జంతువులను పెంపకం అనే పేరుతో బంధించి ఉంచుతారు. ఇది ఎంత మాత్రమూ సరికాదు. కుక్కలు, పిల్లులు మొదలైన వాటిని పెంచవచ్చు. అయితే వాటిని మీ పిల్లల లాగా చూసుకోగలిగితేనే పెంచండి లేకపోతే లేదు. ఎట్టిగా పెంచవద్దు. మీకు వీలు కాదంటే పెంచాల్సిన అవసరం ఏం ఉంది? మీకు వీలు లేదు, ఓపిక లేదు అని అంటే ఎందుకు మరి పెంచడం ?

చిలుకలను పంజరంలో బంధించి ఉంచినందుకే "సీతమ్మ" వారికి అశోక వనంలో బందీ కావాల్సి వచ్చింది అనే కథ ఒకటి ప్రాచుర్యం లో ఉంది.(ఇది ఎంత వాస్తవమో నాకు తెలియదు. ఒక వేల వాస్తవం కాకపోతే, మంచి విషయం చెప్పడానికే ఉదాహరణగా తీసుకున్నాను కాబట్టి దయచేసి మన్నించి, నేను చెబుతున్న విషయాన్ని పక్క దారి పట్టించకండి) రావణుడు సీతమ్మను బంధించడానికి ఎన్నో ఇతర దివ్య కారణాలు ఉన్నాయనుకోండి, అయితే ఈ కారణం కూడా ఒకటిగా చెబుతారు. అంతటి సీతా మహా సాధ్వియే తన జీవితంలో స్వేచ్ఛ, సాధికారతను కోల్పోయిందంటే ఇక మామూలు మనుషుల సంగతి చెప్పడానికేముంది!

ఎట్టి పరిస్థితులలోనూ ఏ జీవులను బంధించి ఉంచరాదు. మన రాక్షసానందానికి "పెంపకం" అనే పేరు పెట్టి పక్షుల, జంతువుల జీవితాలను హరించి వేయడం మనకే ప్రమదం. చాలా ప్రమాదం.

మనకు ఏ గుణాలు, ఏ భావాలైతే ఉంటాయో వాటినే మనం అనుభవించాలి అనే విషయాన్ని మరవద్దు.

పక్షులకు, జంతువులకు స్వేచ్చను ఇవ్వాలి, అసలు మనం ఎవరం వాటికి స్వేచ్చనివ్వడానికి ?! అని ఆలోచించండి. వాటి స్వేచ్చకు మనం భంగం కలిగించరాదు.

"మీకు ఏమి కావాలో, దానినే చేయండి" అని ఒక విశ్వ సూత్రం చెబుతుంది. స్వేచ్ఛ కావాలంటే స్వేచ్చనివ్వండి, బంధీ కావాలంటే బంధించండి. అయితే గుర్తుంచుకోండి "మీరు ఏం చేస్తారో అది అంతకు వేయి రెట్లుగా పొందుతారు"!!

మీ ఇంట్లో ఏవైనా పక్షులు కానీ, చేపలు కానీ ఉంటే వాటికి స్వేచ్చనివ్వండి. పక్షులను ఊరవతలకి తీసుకుపోయి వదిలేయండి, చేపలయితే శుభ్రమైన జలాశయాల్లో వదిలేయండి. ఇతర ఏవైనా జంతువులు పెంపకం లేదా హాబి అనే ముసుగులో బంధించబడి ఉంటే గనుక వాటికి స్వేచ్చను అందించండి. ఇది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఇతర ప్రాణుల పట్ల కనికరం లేని వారు అదే గుణం చేత తమ జీవితంలో నరకయాతనను అనుభవిస్తారు. మరి విషయం తెలియక తప్పు జరిగిపోయింది ఎలా అంటే, కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. కేవలం మీ అవగాహన సరిపోతుంది. "అవగాహన" వచ్చిందంటే చాలు మీరు "కర్మ" అనుభవించాల్సిన అవసరం లేనే లేదు. "అసలు ఏ కర్మలు కూడా ఎవరూ అనుభవించాల్సిన అవసరం లేదు గాక లేనే లేదు." అంతా అవగాహన కోసమే ! మరి వాటిని వేరే వారు పట్టుకుంటారేమో అని అంటే, అది మీకు అనవసరం, వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవిస్తారు, మీకెందుకు ! ముందు మీ సంగతి చూసుకోండి. ఈ సత్యాలను అందరికీ చెప్పండి, పక్షుల, చేపల, జంతువుల స్వేచ్ఛ కోసం ఉద్యమించండి. దీని వలన మీకెంతో స్వేచ్ఛ, సాధికారత లభిస్తాయి. మీకెంతో శ్రేయస్కరం జరుగుతుంది. మీ కర్మలు పోతాయి. కర్మ ప్రక్షాళనకు "సేవ" అత్యుత్తమమైన, అత్యున్నతమైన మార్గం. పరమ పవిత్రమైన మార్గం.

మనం హృదయం గల మనుషులం. అలోచించి అవగాహనతో ప్రవర్తిద్దాం, మనుషులమైన మనం మనుషులు గానే జీవిద్దాం !

అందరికీ అవగాహన వచ్చు గాక !
సర్వులకు స్వేచ్ఛ, సాధికారతలు లభించు గాక !

టూత్ పేస్ట్ లో ఏమేం ఉంటాయి ?

టూత్ పేస్ట్ లకు సంబంధించి చాల మందికి తెలియని రహస్యం ఒకటుంది. ఏవో కొన్ని ఆయుర్వేద ఉత్పత్తుల్లో తప్పించి, మిగితా టూత్ పేస్టుల్లో సాధారణంగా... మురికిని తొలిగించేందుకు ఉపయోగపడే సోడియం లారిల్ సల్ఫేట్, దంతాలను శుభ్రం చేసే ఒక పదార్ధం, టూత్ పేస్ట్ ని కాస్త రుచికరంగా మార్చే పదార్ధం, మెత్తని సిలికా లేదా జిగురు పొడి, ఫ్లోరైడ్ ఆధారిత రసాయనాలు, ఇంకా యాస్పిరిన్ కి సంబంధించిన ఒక రసాయనము ఉంటాయి. ఆయా పదార్ధాలు ఏవేవి ఎంతెంత ఉండాలనే దాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారు.

వీటితో పాటు టూత్‌ పేస్టుల్లో గ్లిసరిన్‌ ని కూడా కలుపుతారు. ఈ పదార్థాన్ని మొక్కల నుంచి గాని జంతువుల నుంచి గాని సేకరిస్తారు. ఒక వేళ అది జంతువుల నుండి తయారయ్యే ఉత్పత్తి అయినట్లయితే సాధారణంగా అది ఎద్దు మంసం నుంచి కాని , పంది మాంసం నుంచి కాని వచ్చినదై ఉంటుంది. అంటే టూత్‌ పేస్టుల్లో కూడా శాకాహార టూత్‌ పేస్టులు, మాంసాహార టూత్‌ పేస్టులు అని రెండు రకాలవి ఉన్నాయన్న మాట. వనమూలికలతో తయారయ్యే టూత్‌ పేస్టులు, గ్లిసరిన్‌ లేకుండా ఉండే టూత్‌ పేస్టులు శాకాహార టూత్‌ పేస్టుల కిందకి వస్తాయి.

- సాక్షి దిన పత్రిక సౌజన్యంతో ( కిడ్స్‌ స్పెషల్‌, పేజ్‌ నం. 34, తేది : 19 జులై 2008)