Welcome Guest
Register

మానవ జాతి విముక్తికి(మోక్షానికి) తమ దివ్యత్వ స్మరణయే సులభ, సరళ, సురక్షిత, అత్యంత శీఘ్ర, ఖచ్చితమైన మరియు దివ్య మార్గం !

క్రింది కానీ, గోడకు కానీ, కుర్చీలో కానీ, సోఫాలో కానీ, మంచం పైన కానీ కూర్చోవచ్చు. ఎక్కడ మీకు సౌకర్యంగా ఉంటే అక్కడ, ఎలా మీకు అనుకూలంగా ఉంటే అలా కూర్చోవాలి. సౌకర్యంగా కూర్చోవాలి. మెడ, వెన్నెముక నిఠారుగా పెట్టి, శరీరాన్ని బిగపట్టి కూర్చోకూడదు. మీ శరీరం ఎంత అనుకూలిస్తే అంతగా, ఆ విధంగా కూర్చోండి. క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఉంటే, ఆటోమెటిక్ గా మెడ, వెన్నెముక నిఠారుగా అయిపోతాము. శరీరాన్ని పూర్తిగా వదిలేయాలి. రిలాక్స్ గా శరీరాన్ని వదిలేయాలి. శరీరంలో ఏ భాగం కూడా బిగపట్టి ఉండరాదు. తర్వత రెండు కళ్ళు మూసుకుని, హాయిగా కూర్చోవాలి. మీరు పూర్తిగా సుఖంగా, సౌకర్యంగా, స్థిరంగా ఎక్కువ సేపు కూర్చునే విధంగా కూర్చోవాలి.

ఆ తర్వాత...........

ఏ దేవతా స్వరూపాన్ని కాని, ఏ విగ్రహాన్ని కాని, మరేదైనా రూపాన్ని కాని ఊహించరాదు.
దేనిని కూడా ఊహించకూడదు. మరే ఇతర జపం కానీ, స్మరణ కాని చేయకూడదు.

రెండు కళ్ళు మూసుకుని మీ నుదిటి వైపు చుడండి. మీ దృష్టి ఎక్కడైతే ఆటోమెటిక్ గా స్థిరం అవుతుందో అదే " దివ్య కేంద్రం". దాని పైనే మీ దృష్టిని నిలిపి ఉంచి, ధీమాగా, భావనాత్మకంగా " నేనే దైవం" అని గాడంగా లోపల అనుకుంటూ ఉండాలి. ఇదే దైవత్వ సాధన ! గుర్తుంచుకోండి - కళ్ళు మూసుకుని ఉన్న మీ దృష్టి మాత్రం, మీ యొక్క " దివ్య కేంద్రం" పైనే నిలిపి ఉంచాలి. ఇలా చేస్తే ఫలితాలు మహాద్భుతంగా, అమోఘంగా, మహా దివ్యంగా, మహా గొప్పగా, ఖచ్చితంగా వస్తాయి.

నేనే దైవం - లేదా - నేను దైవాన్ని- లేదా - నేనే మూల చైతన్యం - లేదా - అల్ట్రా కాన్షియుస్

- లేదా-

I am Ultra Consciousness - or - I am God - or - I am Divine

మీరు పై వాటిలో దేనినైనా ఎంచుకుని సాధన చేసుకోవచ్చు. అన్నీ ఒకటే.

నేను అని అంటే అహంకారం ధ్వనిస్తుందనుకుని పొరపడేరు. నేను కేవలం ఈ దేహానికి మాత్రమే సంభందించిన వాడిని/దానిని , అనే దేహ భావంలో ఉంటే, నేను అనేది అహంకారం అవుతుంది. నేనే అంతా... అంతా నేనే.... అనే ఏకత్వ భావనలో ఉంటే అహంకారం శూన్యం అవుతుంది.అహంకారం అంటే
" నేను సర్వస్వం నుండి వేరు " అనే భావన. అహం శూన్యం అవగానే లోపల సరైన , తగిన వాతావరణం ఏర్పడి నిజతత్వం/ దైవత్వం/ ఏకత్వం సిద్ధిస్తుంది.

" నేనే దైవం" అనే ఎరుకను అలా కొనసాగిస్తూ ఉండటమే " దైవత్వ సాధన". రిలాక్స్ గా ధ్యానంలో కూర్చుని - " నేను దైవాన్ని" అని భావనాత్మకంగా , గాడంగా , సంపూర్ణమైన అంగీకారంతో ఒప్పుకుంటూ ఉండాలి. ఇదే దైవత్వ సాధన.

మనమే దైవాలమైనప్పుడు, మళ్ళీ ప్రత్యేకంగా ఈ సాధన ఎందుకు?

నిజమే ! మనం దైవాలమే ! అయితే, మనం మన యొక్క ఇచ్చా పూర్వకంగా మన దైవత్వాన్ని మనం మర్చిపోయాము. మనమే మర్చిపోయాము కాబట్టి తిరిగి మనంతట మనమే ఆహ్వానించాలి. మనంతట మనమే ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అన్నా, ఆహ్వానించడం అన్నా, నేను దైవాన్ని అనే ఎరుకను కొనసాగించడం అని అన్నా, దైవత్వ సాధన చేయడం అన్నా ఒక్కటే !!

మనల్ని మనం ఎందుకు మర్చిపోయాము? అనే కారణాలు మీరు మీ యొక్క దైవత్వాన్ని తిరిగి పొందాక అన్నీ వివరంగా, చక్కగా తెలుస్తాయి, అర్ధం అవుతాయి. కాబట్టి, ముందు దైవత్వాన్ని పొందే సాధన చేస్తే మంచిది.

నేను దైవాన్ని...నేను దైవాన్ని... అని అనడం అంటే మీ దవత్వాన్ని తిరిగి ఆహ్వానించడమే ! నేను దైవాన్ని అని మీరు అనుకోవడం అని అంటే మీ దైవత్వాన్ని మీరు అనుమతిస్తునట్టే , ఒప్పుకుంటునట్టే, మీ యొక్క సంసిద్ధతను ప్రకటించినట్టే!

గుర్తుంచుకోండి - మీరు కొత్తగా దైవాలుగా మారటం లేదు. మీరు దైవత్వాన్ని తయారు చేయటం లేదు. అది ఇప్పటికే ఉంది. మీలోనే ఉంది. కేవలం మీ పిలుపు కోసం , మీ ఒప్పుకోలు కోసం ఎదురు చూస్తూ ఉంది. దైవత్వం మన యొక్క " ఫ్రీ విల్" ను భంగపరచదు. కాబట్టే మనం ఒప్పుకున్నప్పుడే వస్తుంది.

దైవత్వ సాధనలో ఆత్రం పనికిరాదు. ఆందోళన అసలే పనికిరాదు. కంగారు పడకూడదు. ధీమాగా, విశ్వాసంతో సాధన చేయాలి. మిమ్మల్ని మీరు ఆహ్లాదకరంగా ఉంచుకుంటూ, మీ పట్ల మీరు ప్రేమగా ఉంటూ, ఆనందంగా సాధన చేయాలి.

మీలో ఆత్రం పోయినప్పుడు, మీలో భయాలు పోయినప్పుడు దైవత్వం సిద్ధిస్తుంది. సాధన చేస్తూ ఉంటే అన్నీ క్లియర్ అవుతాయి. కాబట్టి క్రమం తప్పని సాధన సరిగా చేసి తీరాలి. దైవత్వం ఎక్కడి నుండో రావటం లేదు. మీలో నుండే వస్తుంది. ప్రస్తుతం మీలోనే ఉంది. మీకే ఎరుక లేదు. మీ శరీరంలో దైవత్వాన్ని మీరు పుట్టినప్పటి నుండీ మోస్తూనే ఉన్నారు. మీ శరీరం మీ దైవత్వ అనుభవాన్ని, దివ్య నేత్రం తెరుచుకునే అనుభవాన్ని మరియు కుండలినీ జాగరణ అనుభవాన్ని తట్టుకునే శక్తి సామర్ధ్యాలను సహజంగానే కలిగి ఉంది.